నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ (అక్టోబరు 7, 1885 - నవంబర్ 18, 1962) , డెన్మార్క్ కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఆయన పరమాణు నిర్మాణం గురించి, క్వాంటమ్ సిద్ధాంతం గురించి కీలకమైన పరిశోధన చేశాడు. అణువుల నిర్మాణం, అవి వెలువరించే కిరణాల ఆవిష్కరణకు గాను ఆయనకు 1922లో నోబెల్ బహుమతి లభించింది.. ఆయన శాస్త్రవేత్తయే కాక తత్వవేత్త కూడా. సైన్సు పరిశోధనను ప్రోత్సహించాడు.
ఏదైనా పదార్థాన్ని విభజించుకుంటూ పోతే అది విభజనకు వీలుగాని అణువులు లేదా పరమాణువులుగా విడిపోతుంది. ఈ అణువుల గురించి స్పష్టమైన అవగాహనను కల్పించిన వారిలో ఒకడిగా నీల్స్‌బోర్ పేరు పొందాడు. ఈయన బోర్ పరమాణు నమూనా రూపొందించాడు. అణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయని, ఆ కక్ష్యల్లో శక్తి స్థిరంగా ఉంటుందని ప్రవేశపెట్టి ఆ కక్ష్యలను స్థిరకక్ష్యలుగా నామకరణం చేశాడు. ఎలక్ట్రాన్లు ఒక కక్ష్య నుండి మరో కక్ష్యకు కూడా దూకగలవు అని ప్రతిపాదించాడు.
మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా పరమాణు నమూనాను ప్రవేశ పెట్టాడు. బయటి కక్ష్యలలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ మూలకపు రసాయన ధర్మాలను నిర్ణయిస్తుందని చెబుతూ ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. అణు, పరమాణు నిర్మాణాలను వివరించడానికి తొలిసారిగా సంప్రదాయ యాంత్రిక శాస్త్రాన్నీ (classical mechanics), క్వాంటమ్ సిద్ధాంతాన్ని అనుసంధానించిన రూపశిల్పి ఆయన. ఈయన కుమారుడు కూడా నోబెల్‌ను పొందడం విశేషం.1962 నవంబర్ 18న కోపెన్‌హాగన్‌లో నీల్స్ బోర్ మరణించాడు.
నీల్స్ బోర్ 1885 అక్టోబర్ 7న క్రిష్టియన్ బోర్, ఎలెన్ ఎడ్లెర్ బోర్ దంపతులకు డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జన్మించాడు. నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ చిన్నతనం నుంచే అత్యంత ప్రతిభను కనబరిచాడు తండ్రి అక్కడి విశ్వవిద్యాలయంలో ఫిజియాలజీ ప్రొఫెసర్. 1903లో గణితం, వేదాంతం అభ్యసించడానికి కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. తర్వాత వేదాంతానికి బదులు భౌతికశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాడు. 1911లో డాక్టరేట్ పట్టా పొందాడు. 'జె.జె. థామ్సన్ వద్ద చేరి పరిశోధనలు చేశాడు. తర్వాత మాంచెస్టెర్ విశ్వవిద్యాలయంలో 'ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ వద్ద పనిచేస్తూ పరిశోధనలు కొనసాగించాడు. అక్కడే చదివిన నీల్స్‌బోర్ 22 ఏళ్ల వయసులో తలతన్యతపై చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని సాధించాడు. ఇరవై ఆరేళ్లకల్లా పీహెచ్‌డీ సంపాదించిన బోర్, ఆపై ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జిలో ఉండే కావండిష్ లేబరేటరీలో సర్ ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్‌తో కలిసి పనిచేశాడు. ఇరవై ఎనిమిదేళ్లకే అణు నిర్మాణాన్ని ప్రకటించాడు. ఈ అణు నమూనా రసాయన శాస్త్రాన్ని, విద్యుచ్ఛక్తిని మరింతగా అర్థం చేసుకోడానికే కాకుండా అణు శక్తిని ఉత్పాదించి అభివృద్ధి పరచడానికి దోహద పడింది.
అణు కేంద్రకం చుట్టూ పరిభ్రమించే ఎలక్ట్రాన్లు ఎక్కువ శక్తి గల కక్ష్య నుంచి తక్కువ శక్తిగల కక్ష్యలోకి దూకినప్పుడు కాంతి రూపంలో శక్తిని వికిరణం చేస్తాయని బోర్ తెలిపాడు. ఎలక్ట్రాన్ వెలువరించే ఈ శక్తి వికిరణం విడివిడిగా ప్యాకెట్ల రూపంలో వెలువడుతుంది. ఒక ప్యాకెట్ శక్తి లేదా క్వాంటమ్‌ను ఫోటాన్ అంటారు. క్వాంటమ్ అంటే జర్మన్ భాషలో చిన్న ప్యాకెట్ అని అర్థం.
అధిక ఉష్ణోగ్రతకు గురి చేసినప్పుడు మూలకాలు వెదజల్లే కాంతిని గాజు పట్టకం ద్వారా ప్రసరింప చేస్తే వేర్వేరుగా వర్ణపటాలు వెలువరిస్తాయనివాటిని బట్టి ఆయా మూలకాలను గుర్తించవచ్చని ప్రకటించాడు. బోర్ పరిశోధనల ఆధారంగానే ఆవర్తన పట్టిక రూపకల్పన, కేంద్రక విచ్ఛిత్తిపై సమగ్ర అవగాహన సాధ్యమయ్యాయి. ఆయనకు లభించినన్ని బహుమతులు, పురస్కారాలు శాస్త్రలోకంలో మరే శాస్త్రవేత్తకూ లభించలేదు.
Comments
Post a Comment